వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. త‌ర‌చూ వైసీపీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న సొంత పార్టీ ఎంపీపై క‌క్క‌లేక‌, మింగ‌లేక అనే ప‌రిస్థితిని వైసీపీ ఎదుర్కుంటోంది.
     మ‌రోవైపు పార్టీని ఇరుకున పెట్టేలా, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అస్త్రాల‌ను అందించేలా ర‌ఘురామ‌కృష్ణంరాజు మాట‌ల దాడిని పెంచుతున్నారు. ఆయ‌న‌కు కౌంట‌ర్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు రంగంలోకి దిగినా ఆయ‌న మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అయితే, ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో త‌న‌కు ఇబ్బంది లేద‌ని, జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే వ్య‌క్తుల‌తో ఇబ్బంది ఉంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.దివంగ‌త వైఎస్సార్ కుటుంబానికి ర‌ఘురామ‌కృష్ణంరాజు స‌న్నిహితుడు. వైఎస్సార్ అప్త‌మిత్రుడు కేవీపీ రామ‌చంద్ర‌రావుకు ఆయ‌న వియ్యంకుడు. చాలా ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతో ర‌ఘురామ‌కృష్ణంరాజుకు మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయ‌న గ‌తంలోనే వైసీపీలో చేరారు.
              త‌ర్వాత మ‌ళ్లీ టీడీపీ, బీజేపీలోకి వెళ్లారు.గ‌త ఎన్నిక‌ల ముందు ఆయ‌న మ‌రోసారి వైసీపీలో చేరి న‌ర్సాపురం టిక్కెట్ ద‌క్కించుకున్నారు. అయితే, గెలిచిన కొంత‌కాలం నుంచే ఆయ‌న వైసీపీకి వ్య‌తిరేకంగా కామెంట్స్ చేయ‌డం ప్రారంభించారు. పార్టీ స్టాండ్‌కు విరుద్ధంగా స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఇది మ‌రింత పెరిగింది.ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే రెండు ఛాన‌ళ్ల‌ను ఆ పార్టీ చాలా రోజుల క్రిత‌మే బ‌హిష్క‌రించింది.వైసీపీ నేత‌లు ఎవ‌రూ ఆ ఛాన‌ళ్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. చ‌ర్చ‌ల‌కు కూడా వెళ్ల‌రు. కానీ, ర‌ఘురామ‌కృష్ణంరాజు మాత్రం ప‌ని గ‌ట్టుకొని ఆ ఛాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వైసీపీపై, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు తీరును సైతం ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌ప్పుప‌ట్టారు. టీడీపీకి, టీడీపీ అనుకూల మీడియాకు కావాల్సిన రీతిలో ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్యాఖ్య‌లు ఉంటున్నాయి.మొద‌ట ఆయ‌న వ్య‌వ‌హారాన్ని తేలిగ్గా తీసుకున్న వైసీపీ జ‌రుగుతున్న నష్టంతో తేరుకుంది. న‌ర్సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో ఆయ‌న‌కు కౌంట‌ర్ వేస్తోంది.దీనికి ర‌ఘురామ‌కృష్ణంరాజు కూడా అంతే ధీటుగా బ‌దులిస్తున్నారు. ఒకానొక స‌మ‌యంలో వైసీపీ నేత‌లే కాళ్లావేళ్లా ప‌డితే తాను వైసీపీలో చేరాన‌ని, త‌న వ‌ల్లె న‌ర్సాపురం ఎంపీ సీటుతో పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ సీట్ల‌ను కూడా వైసీపీ గెలుచుకుంద‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు అంటున్నారు. పార్టీపైన‌, ప్ర‌భుత్వంపైన విమ‌ర్శ‌లు చేస్తున్నా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైన మాత్రం ఆయ‌న ఎటువంటి విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం లేదు.జ‌గ‌న్‌కు కొంద‌రు త‌ప్పుడు స‌ల‌హాలు ఇస్తున్నార‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌. క‌నీసం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌నీయ‌డం లేద‌ని అంటున్నారు. ఆయ‌న జ‌గ‌న్ స‌ల‌హాదారులు, వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల ప‌ట్ల ప‌రోక్షంగా విమర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే విజ‌య‌సాయిరెడ్డితో ఆయ‌న‌కు ఏ మాత్రం పొస‌గ‌డం లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డితో ర‌ఘురామ‌కృష్ణంరాజుకు కొంత దూరం పెరిగింది. ఆయ‌న ప‌దేప‌దే రెడ్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు అని చేస్తున్న కామెంట్ల వెనుక కూడా విజ‌య‌సాయిరెడ్డి టార్గెట్ అనిపిస్తోంది.అయితే, ఇక పార్టీతో తాడోపేడో తేల్చుకోవాల‌నే ఉద్దేశ్యంతోనే ర‌ఘురామ‌కృష్ణంరాజు ఇలాంటి సీరియ‌స్ కామెంట్లు చేస్తున్నారు.
                  ఆయ‌న బీజేపీ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ, జ‌గ‌న్ ఆయ‌న వ్య‌వ‌హారంపై వేచిచూసే ధోర‌ణిలో ఉన్నారు.ర‌ఘురామ‌కృష్ణంరాజును పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే ఆయ‌న స్వ‌తంత్రుడిగా మారే అవకాశం ఉంది. బీజేపీతో బాహాటంగానే వెళ్ల‌వ‌చ్చు. కాబ‌ట్టి, ఇప్పటికిప్పుడు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయ‌క‌పోవ‌చ్చు. ర‌ఘురామ‌కృష్ణంరాజు కూడా త‌న‌ను జ‌గ‌న్ స‌స్పెండ్ చేయ‌ర‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. మొత్తంగా ఆయ‌న వ్య‌వ‌హారం మాత్రం వైసీపీని బాగా ఇబ్బంది పెడుతోంది. ఆయన విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితోనే వున్నారు. జగన్ వ్యవహారశైలి పై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ అనుకూల మీడియా ద్వారా ఎంపీని టార్గెట్ చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *