ఏపీ సర్కారు మరో వివాదస్పద నిర్ణయం

ఏపీ సర్కారు మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు క్షమాపణలు కోరుతూ నోటీసులు జారీ చేశారు. పది హేను రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కేసు దాఖలు చేయటంతోపాటు సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు.

ఇది ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త పరిణామం కిందే చెప్పొచ్చు. మీడియాలో ఎప్పుడైనా నిరాధార వార్తలు వస్తే రిజాయిండర్ ఇవ్వటంతోపాటు..అది కూడా ప్రచురించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఈ సారి ఓ మీడియా సమావేశం వార్తను ప్రచురించినందుకు ఓ ఐఏఎస్ అధికారి నోటీసులు జారీ చేయటం అత్యంత కీలకంగా మారింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సున్నపురాయి మైనింగ్ లీజు ను 50 సంవత్సరాలకు పొడిగిస్తూ గనుల శాఖ నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినతే చంద్రబాబు చేప్పిన వివరాలను ప్రచురించినందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు కూడా గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తన నోటీసుల్లో పేర్కొన్నారు.

జూన్ 10న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారమే , నిబంధనల ప్రకారమే మైనింగ్ లీజు కాలపరిమితి పెంచాం తప్ప…ఎలాంటి ఉల్లంఘనలు లేవని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈ లీజు పొడిగించటంలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వులులో ఏవిధమైన పక్షపాతం మరియు ఏ సంస్థకు అనుకూలంగా వ్యవహరించలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించినచో అలాంటి వ్యక్తులు, సంస్థల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని, ఇట్టి వ్యాఖ్యానాలు మరియు వార్తలు పరువు నష్టం కింద పరిగణించబడునని తెలియచేయుచు పత్రికాముఖంగా ప్రతి జవాబును విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *