వైకాపా హీరోలు- సినిమా ఇండస్ట్రీలో లేరా!…

టాలీవుడ్‌ సమస్యల‌పై చర్చించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలిసిన సినీప్రముఖుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. తమ స్వంత సమస్యల‌ కోసం వచ్చి ‘సినీ పరిశ్రమ, సినీ కార్మికుల‌ సమస్య’ పరిష్కరించేందుకు వచ్చామని చెబుతోన్న వారి వ్యవహారశైలిపై సినీ రంగం నుంచే విమర్శులు వస్తున్నాయి.

కాగా మరోవైపు ఆశ్చర్యకరంగా అధికార వైకాపా పార్టీకి మొద‌టి నుంచి మ‌ద్దతు ఇస్తోన్న సినీ న‌టుల‌  నుంచి కూడా వీరిపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖుల్లో మొదటి నుంచి వైకాపాకు మద్దతు ఇచ్చేవారెవరూ లేకపోవడమే దీనికి కారణం. వైకాపా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తోన్న పలువురు సినీ ప్రముఖులెవరూ ఈ సమావేశంలో లేరనే మాట వినిపిస్తోంది. (విజయచందర్‌ తప్ప) వైకాపాకు మొదటి నుంచి మద్దతు ఇస్తోన్న 40ఇయర్‌ ఇండస్ట్రీ ‘ఫృద్దీ’తో పాటు సీనియర్‌ నటుడు ‘మంచు మోహన్‌బాబు, పోసాని కృష్ణమురళీ, ఆలీ,జీవిత దంప‌తులు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వంటి వారెవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదు. వీరంతా ఎన్నికల‌ ముందు నుంచి ‘జగన్‌’కు మద్దతు ఇస్తున్నారు. వీరు కాకుండా పలువురు నిర్మాతలు, హీరోయిన్‌లు వైకాపాను సమర్థించారు.

వీరిలో ముందుగా చెప్పుకోవాల్సి ‘మోహన్‌బాబు’ గురించి. ఆయన గత ఎన్నికల‌కు ముందు విద్యార్థుల‌కు టిడిపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లు చెల్లించడం లేదని నడిరోడ్డుపై కుటుంబంతో సహా ధర్నా చేశారు. పైగా ఆయన స్వయానా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కు బంధువు కూడా…! మరి ఆయనను ఈసమావేశానికి పిల‌వలేదు. మరో నటుడు ‘పోసాని కృష్ణమురళీ’ ‘జగన్‌’కు వీరాభిమాని. మెజార్టీ సినీ పరిశ్రమ టిడిపికి మద్దతుగా ఉన్నా..నాడు ‘పోసాని కృష్ణమురళీ, ఫృద్వీ తదితరులు వైకాపాకు మద్దతు పలుకుతూ ప్రచారం చేశారు. అయితే వీరెవరూ ప్రస్తుతం సిఎంను కలిసిన వారిలో లేకపోవడం ఆశ్చర్యకరం. వాస్తవానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిని కల‌సినవారిలో ‘చిరంజీవి’ వైకాపాను సమర్థించలేదు. గత ఎన్నిక సమయంలో ఆయన తటస్థంగా ఉండిపోయారు. ఇటీవ కాలం ‘సైరా’ సినిమా కోసం ముఖ్యమంత్రిని కల‌సి దానికి ఎవో పన్నులు మినహాయింపును కోరారు. ఇక అప్పటి నుంచి జగన్‌తో కల‌సిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ‘అక్కినేని’ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల‌కు దూరంగా ఉంటోంది. వైకాపాకు, టిడిపికి సమానదూరంలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటోంది. కాగా అగ్రదర్శకుడు ‘రాజమౌళి’ గత ప్రభుత్వం హయాంలో ‘అమరావతి’ కోసం కొన్ని గ్రాఫిక్స్‌ తయారు చేశారు. ‘చంద్రబాబు’కు దగ్గరనే పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రముఖులుగా చెప్పుకుంటూ ముఖ్యమంత్రిని కల‌సిన వారిలో వైకాపాకు నేరుగా మద్దతు ఇచ్చేవారెవరూ లేకపోవడం విశేషం. మొదటి నుంచి వైకాపా కోసం కష్టపడిన వారు, ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి, నైతిక మ‌ద్ద‌తు ఇచ్చిన వారెవ‌రూ..ఈ సమావేశంలో లేకపోవడం, క‌నీసం వారిని ఆహ్వానించ‌క‌పోవ‌డం  వారిని అసంతృప్తికి గురిచేసిందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *