చిత్ర పరిశ్రమ విశాఖపట్నం వెళుతుందా!

 తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే వారికి అపాయింట్‌మెంట్ ఖరారైంది. చిరంజీవి, నాగార్జున ఆధ్వ‌ర్యంలో ఇండ‌స్ట్రీ నుంచి అన్ని విభాగాల ప్ర‌ముఖులు జ‌గ‌న్‌తో భేటీకి హాజ‌రుకానున్నారు.
      ఇటీవ‌ల ఈ బృందం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా క‌లిసింది. క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్ నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల గురించి వారు కేసీఆర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని కేసీఆర్ నుంచి హామీ కూడా ల‌భించింది.కేసీఆర్‌తో భేటీ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే ఏపీ సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ పెద్ద‌ల భేటీకి మాత్రం చాలా ప్రాధాన్య‌త ఉంది. నిజానికి ఈ భేటీ ఎప్పుడు జ‌రుగుతుందా అని ఏడాది కాలంగా చ‌ర్చ న‌డుస్తోంది. నిజానికి టాలీవుడ్‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే వారు ఎక్కువ‌గా ఉంటార‌నే ప్ర‌చారం ఉంది. 2014 ఎన్నిక‌ల్లో గెల‌వ‌గానే అనాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు వెళ్లి స‌న్మానించి వ‌చ్చారు. కానీ, జ‌గ‌న్ గెలిచిన 9 నెల‌ల వ‌ర‌కు చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఆయ‌న వ‌ద్ద‌కు ఎవ‌రూ వెళ్ల‌లేదు. మూడు నెల‌ల క్రితం ప‌లువురు నిర్మాత‌లు మాత్రం జ‌గ‌న్‌ను క‌లిసి వైజాగ్‌లో హుద్‌హుద్ బాధితుల‌కు టాలీవుడ్ త‌ర‌పున క‌ట్టించిన ఇళ్ల ప్రారంభానికి రావాల‌ని ఆహ్వానించారు.అంత‌కుముందు సైరా చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు కూడా ఒక‌సారి జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అయితే, ఇప్పుడు మాత్రం అంద‌రు క‌లుస్తుండ‌టం కొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌తంలోనే చిత్ర ప‌రిశ్ర‌మ గురించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో చిరంజీవి మాట్లాడారు. ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎటువంటి స‌హ‌కారమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జ‌గ‌న్ ఆయ‌న‌కు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా జ‌గ‌న్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అడిగిందే త‌డ‌వుగా హామీలు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రోత్స‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది.ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అనువైన వాతావ‌ర‌ణం ఉంది. నిజానికి టాలీవుడ్ మొత్తం హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డినా విశాఖ‌ప‌ట్నంలోనూ పెద్ద ఎత్తున షూటింగ్‌లు జ‌రుగుతాయి. ప్ర‌కృతి అందాల‌కు నెల‌వైన విశాఖ‌లో అనేక షూటింగ్ లోకేష‌న్లు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో స‌గ‌టున ఒక రోజు 40 షూటింగ్‌లు జ‌రుగుతుంటే విశాఖ‌ప‌ట్నంలో 10 – 15 చిత్రాల‌కు సంబంధించి షూటింగ్‌లు జ‌రుగుతున్నాయ‌ని లెక్క‌లు చెబుతున్నాయి. విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంతో అర‌కులో ఎక్కువ షూటింగ్‌లు జ‌రుగుతాయి. విశాఖ‌కు స‌మీపానే ఉన్న కోన‌సీమ‌లోనూ పెద్ద ఎత్తున షూటింగ్‌లు జ‌రుగుతాయి. ఇలా షూటింగ్‌ల‌కు విశాఖ అనువైన ప్రాంతం.ఈ విష‌యాన్ని ముందే గుర్తించిన సినీరంగ పెద్ద‌లు కొంద‌రు విశాఖ‌ప‌ట్నంలో స్టూడియోల ఏర్పాటుకు స‌న్నాహాలు చేశారు. రామానాయుడు స్టూడియో ఏర్పాటు చేశారు. రామోజీ రావు కూడా హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ త‌ర‌హాలోనే విశాఖ‌లోనూ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాల‌ని భావించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా విశాఖ‌లో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పేందుకు 317 ఎక‌రాల భూమిని కూడా గ‌తంలోనే కేటాయించారు. ఇప్పుడు విశాఖప‌ట్నం రాష్ట్ర పాల‌నా రాజ‌ధానిగా మారుతుండ‌టంతో న‌గ‌రానికి కొత్త క‌ళ వ‌స్తోంది. విశాఖ‌కు మాత్ర‌మే హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరుతో పోటీ ప‌డే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. ఇలా అన్ని ర‌కాలుగానూ విశాఖ‌లో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అనువైన వాతావ‌ర‌ణ‌మే ఉంది. జ‌గ‌న్ కూడా ఈ మేర‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను విశాఖ‌కు ప్రోత్స‌హించే అవ‌కాశం ఉంది. మ‌రి, సినీ ప్ర‌ముఖులు ఎలా స్పందిస్తార‌నేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *