పరిపాలన–సంక్షేమం’

25.05.2020,
అమరావతి.

అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమం.
తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ‘పరిపాలన–సంక్షేమం’ పై నిపుణులు–లబ్ధిదార్లు, అధికార్లతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ముఖాముఖి.

*ప్రభుత్వం వచ్చిననాటి నుంచి పథకాలద్వారా మే 20వరకూ 3,57,51,612 మంది లబ్ది*
*వారికి ఖర్చు చేసింది రూ.40,139 కోట్లు*
*బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడూ జరిగి ఉండదేమో*
*సంక్షేమంలోఇంత రివల్యూషనరీగా చేసిన పరిస్ధితి బహుశా ఎప్పుడూ ఉండదేమో*
*వివరాలు వెల్లడించిన సీఎం*
*మేనిఫెస్టో అనేది నేను బైబిల్‌గా,ఖురాన్‌గా, భగవద్గీత గాను భావిస్తాను*
*ఈ రోజు గర్వంగా చెప్తున్నా ప్రతి అధికారి, ప్రతి మంత్రి దగ్గర చివరకు నా ఛాంబర్‌లో కూడా గోడలకి ఈ మేనిఫెస్టోనే కనిపిస్తోంది*
*మేనిఫెస్టోను బహుశా 90 శాతం మొట్టమొదట సంవత్సరంలోనే పూర్తి చేశాం. ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపు 98–99 శాతానికి చేరుకుంటాం*
*‘పరిపాలన–సంక్షేమం’కు పిల్లర్లు గ్రామ వలంటీర్లు, సచివాలయాలు అందువల్ల ఏనాడూ ఈ వ్యవస్థలోకి అవినీతి రావొద్దు
ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి*
*గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు, నిపుణులతో సీఎం ముఖాముఖి*
*ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్న ఆలోచనలతో పుట్టుకొచ్చిందే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ*
*గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే, వారికి కూడా పథకాలు అందాలని తపించాను
మీ మాటలను ఒక స్ఫూర్తిగా తీసుకుంటాను*
*ఇంకా బాగా పని చేయడానికి ప్రయత్నిస్తాను*
*సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తుంటే,*
*లబ్ధిదారులు పొందే ఆనందం, వారి దీవెనలు ఒక కిక్‌లా పని చేస్తాయి*
*అవి ఉన్నంత వరకు ఈ వ్యవస్థలో అవినీతికి చోటు ఉండదని నా నమ్మకం*
*గ్రామ సచివాలయాలు మొదలు, వ్యవస్థలో మార్పు, సాచ్యురేషన్‌*
*ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు*
*నా స్థాయి నుంచి కలెక్టర్ల వరకు 50 శాతం, ఆ తర్వాత గ్రామ స్థాయి వరకు ఎక్కడా లంచం ఉండొద్దన్నదే లక్ష్యం*
*అందుకే టెండర్ల ప్రక్రియలో కూడా మార్పు చేశాం*
*జ్యుడీషియల్‌ రివ్యూ మొదలు పెట్టాం, ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన*
*గ్రామ, వార్డు వలంటీర్లకు లెర్నింగ్‌ కోసం యాప్‌ ఆవిష్కరించిన సీఎం*

అమరావతి:

పరిపాలన–సంక్షేమం బాగా పని చేయాలంటే అందుకు పిల్లర్లు గ్రామ వలంటీర్లు, సచివాలయాలు అని, అందువల్ల ఏనాడూ ఈ వ్యవస్థలోకి అవినీతి రావొద్దని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారుల మాటలను ఒక స్ఫూర్తిగా తీసుకుంటానన్న సీఎం, ఇంకా బాగా పని చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తుంటే.. ఆ
లబ్ధిదారులు పొందే ఆనందం, వారి దీవెనలు ఒక కిక్‌లా పని చేస్తాయని, ఆ కిక్‌ ఉన్నంత వరకు ఈ వ్యవస్థలో అవినీతికి చోటు ఉండదన్న నమ్మకం తనకుందని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామ సచివాలయాలు మొదలు, వ్యవస్థలో మార్పు, సాచ్యురేషన్‌.. ఇంకా ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. అందుకే తన స్థాయి నుంచి కలెక్టర్ల వరకు 50 శాతం, ఆ తర్వాత గ్రామ స్థాయి వరకు ఎక్కడా లంచం ఉండొద్దన్నదే లక్ష్యం అని వెల్లడించారు. అందుకే టెండర్ల ప్రక్రియలో కూడా మార్పు చేశామని, టెండర్లలో జ్యుడీషియల్‌ రివ్యూ మొదలు పెట్టామని ఇంకా రివర్స్‌ టెండరింగ్‌ కూడా అమలు చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లకు లెర్నింగ్‌ కోసం ఒక యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు.
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. 25వ తేదీ నుంచి 29 వరకు ప్రతి రోజూ ఒక్కో అంశంపై సీఎం సమీక్షించనున్నారు. అందులో భాగంగా తొలి రోజు ‘పరిపాలన–సంక్షేమం’ పై సీఎం నిపుణులు, లబ్ధిదార్లతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్న, డీజీపీ గౌతం సవాంగ్, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌తో పాటు, వివి«ధ శాఖల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన కొందరు సిబ్బందితో పాటు, వివిధ పథకాల లబ్ధిదారులు, నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో వీక్షించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వీడియో ప్రదర్శన:
కార్యక్రమం ప్రారంభంలో రెండు నిమిషాల పాటు వీడియో ప్రదర్శించారు. ప్రజా సంకల్పయాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ‘నేను విన్నాను–నేను ఉన్నాను’ అన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాటలతో పాటు, ఆయన ప్రజలకు ఇచ్చిన సందేశం, ఆ తర్వాత పథకాలపై వివరణ, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు, ఆ సిబ్బంది స్పందన, ఇంటికే వెళ్లి పింఛన్ల పంపిణీ, సున్నా వడ్డీ రుణాలు తదితర పథకాల ప్రస్తావనను ఆ వీడియోలో ప్రదర్శించారు.

వ్యవస్థలో మార్పు రావాలి
గడచిన ఏడాదిలో తమ ప్రభుత్వం ఎలా అడుగులు వేసింది?. అవి బాగా వేశామా? ఏమైనా మార్చుకోవాల్సి ఉందా? అనేది తెలుసుకోవడం కోసమే ఈ సమీక్ష చేపట్టినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అందులో భాగంగా పరిపాలన–సంక్షేమం అంశంపై ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమం అని ఆయన తెలిపారు.
‘ఎన్నికలకు ముందే దాదాపు 14 నెలల పాటు 3648 కి.మీ పాదయాత్ర, అన్ని జిల్లాలు, దాదాపు నియోజకవర్గాలు తిరిగాను. ప్రతి రోజు ప్రజలతో మమేకం అయ్యాను. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్న తపనతో పాదయాత్ర కొనసాగించాను. వ్యవస్థలో మార్పు తెస్తే తప్ప, ప్రజలు అభివృద్ధి చెందరన్న భావనతో, వీటన్నింటినీ అమలు చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

గ్రామ, వార్డు సచివాలయాలు ఎందుకు?
ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాలన్న ఆలోచనలతో పుట్టుకొచ్చిందే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అని సీఎం చెప్పారు.
‘గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే, వారికి కూడా పథకాలు అందాలని తపించాను. ఆ దిశలోనే పని చేశాను. పథకాల లబ్ధిదారుల పేర్లను ప్రతి గ్రామంలోని సచివాలయంలో ప్రదర్శించమని చెప్పాం. అదే విధంగా ఆ పథకానికి కావాల్సిన అర్హతలను కూడా స్పష్టంగా సచివాలయాల్లో ప్రదర్శించమని చెప్పాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ గడప గడపకూ అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

ఎంతో సంతోషం కలిగిస్తోంది
గత ఏడాది ఆగస్టు 15న వలంటీర్లను నియమించామని, ఆ తర్వాత అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. వాటి ద్వారా కేవలం 4 నెలల్లోనే 1.45 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వారిలో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఉండడం విశేషం అని పేర్కొన్నారు. ఇంకా దాదాపు 2.65 లక్షల మంది వలంటీర్లు, ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించామన్న సీఎం, ఇది నిజంగా దేవుడి దయ అని చెప్పవచ్చని పేర్కొన్నారు.
ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీస్‌ వంటి 10 నుంచి 12 మందిని వివిధ విభాగాలలో నియమించామని చెప్పారు. ఆ విధంగా అవినీతికి తావు లేని ప్రజలకు సేవ చేసే ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామన్న సీఎం, ఇది నిజంగా నాకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అని చూడకుండా గ్రామ వలంటీర్లు చాలా బాగా పని చేస్తున్నారని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందని వివరించారు.
ఇంకా బియ్యం నేరుగా డోర్‌ డెలివరీని శ్రీకాకుళం జల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని, పింఛన్లు కూడా డోర్‌ డెలివరీ చేస్తున్నామని, ఇది గతంలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని, సూర్యోదయానికి ముందే ఇంటి తలుపుతట్టి మరీ పెన్షన్‌ ఇస్తున్నారని వివరించారు.
అమ్మ ఒడి ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశామని, దాని వల్ల 82 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి కలుగుతోందని, ఇంకా వైయస్సార్‌ రైతు భరోసా, వాహనమిత్ర.. ఏ పథకం అమలులో అయినా గ్రామ వలంటీర్ల పాత్ర గణనీయం అని అభినందించారు.

వలంటీర్ల సేవలు ప్రశంసనీయం
కోవిడ్‌ వైరస్‌ నివారణలో కూడా గ్రామ, వార్డు వలంటీర్లు ఎంతో బాగా పని చేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఇంటింటి వెళ్లి సర్వే చేశారని ఆయన గుర్తు చేశారు.

అందుకే మద్యం నియంత్రణ
పాదయాత్రలో తాను చూసిన మరో సమస్య మద్యం అని, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు చేశారని తెలిపారు. అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్టుషాపులు రద్దు చేశామని, 4500కు పైగా మద్యం షాపులు ఉంటే వాటిలో 33 శాతం తగ్గించామని,ఎక్కడా పర్మిట్‌రూమ్‌లు లేకుండా చేశామని తెలిపారు. ఇంకా మద్యం విక్రయ వేళలు తగ్గించామని, ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అమ్మడంతో పాటు, ఆ షాపులు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తోందని తెలిపారు. మరోవైపు మద్యం ధరలు పెంచామని, వీటన్నింటి వల్ల ఐఎంఎఫ్‌ఎల్‌ విక్రయాలు, బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఐఎంఎఫఎల్‌ లిక్కర్‌ అమ్మకాలు 23 లక్షల కేసుల నుంచి 10 లక్షలకు తగ్గాయని, ఆ స్థాయిలో మద్యం నియంత్రించామని వివరించారు.

గ్రామాల రూపురేఖలు మార్పు
ఆ విధంగా వ్యవస్థలో మార్పుల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, 2 వేల జనాభా ఉన్న గ్రామంలోకి అడుగు పెడితే సచివాలయం, ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయని అన్నారు. వచ్చే మార్చి నాటికి ఆ క్లినిక్‌లు ఏర్పాటవుతాయన్న ఆయన, వాటిలో 54 రకాల మందులు ఉంటాయని, ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, నర్సులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇక రైతు భరోసా కేంద్రంలో రైతులకు అన్ని రకాల సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాలు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని, విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల పంపిణీ మొదలు.. ఏ పంట వేస్తే లాభం, ఆ తర్వాత పంటలకు గిట్టుబాటు ధర, ఈ–క్రాపింగ్‌ వంటి అన్ని సేవలు అందుతాయని వివరించారు.
త్వరలో జనతా బజార్లు ఏర్పాటు అవుతాయన్న సీఎం, వాటిలో ప్రజలు, రైతులకు కావాల్సిన అన్ని అందుబాటులో ఉంటాయని చెప్పారు. రైతుల ఉత్పత్తులకు స్థానికంగా కనీసం 33 శాతం మార్కెటింగ్‌ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు.

మేనిఫెస్టో ఎంతో పవిత్రం
మేనిఫెస్టో మాకు ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ వంటిదని, అందులో చెప్పిన ప్రతి మాట అమలు చేస్తున్నామని, అందుకే తనతో పాటు, మంత్రులందరి వద్ద ఆ మేనిఫెస్టో ఉంటుందని వెల్లడించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో తొలి ఏడాదిలోనే 90 శాతం అమలు చేశామన్న ముఖ్యమంత్రి వాటిని వివరించారు.

మేనిఫెస్టో అమలు, సంక్షేమ పథకాల కేలండర్‌ ప్రకటన…

మేనిఫెస్టో అనేది నేను బైబిల్‌గా భావిస్తాను, ఖురాన్‌గా భావిస్తాను, భగవద్గీత గాను భావిస్తాను.
ఆ మేనిఫెస్టోలోని ప్రతీ అంశం కూడా నెరవేర్చాలని చెప్పా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా ప్రతి గవర్నమెంట్‌ సెక్రటరీ దగ్గర, ప్రతి మంత్రి దగ్గర చివరకు నా ఛాంబర్‌లో కూడా గోడలకి ఈ మేనిఫెస్టేనే కనిపిస్తోంది. ఏమేం చేశాం, ఏమేం చేయాలన్న తలంపుతోనే అడుగులు వేస్తా ఉన్నాం. ఒక్కసారి గమనించినటై్లతే మేనిఫెస్టోను బహుశా 90 శాతం మొట్టమొదట సంవత్సరంలోనే పూర్తి చేశాం. ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపు 98–99 శాతానికి వెళ్లిపోతామేమో.
ఒక్కసారి ఈ సంవత్సరానికి సంబంధించి, వెల్ఫేర్‌కు సంబంధించిన స్కీములు గనుక çV మనించినట్లైతే..
8–07–2019 పెన్షన్‌ కానుక, ఇంతక ముందు పెన్షన్‌లైతే ఆశ్చర్యం కలిగించే విధం. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇచ్చారనేది గమనిస్తే నవ్వు వస్తోంది. ఎందుకనంటే 2018 అక్టోబరు దాకా అంటే ఎన్నికలకు ఆరునెలలు ముందు దాకా గత ప్రభుత్వ హయామంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవారు అంటే కేవలం 44 లక్షలు మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు.
ఈ రోజు పెన్షన్ల సంఖ్య ఎంతో తెలుసా.. 58.61 లక్షలు ఇస్తున్నాం.
గత ప్రభుత్వం 02–19–2019 వరకు అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు దాకా పింఛను ఎంతిచ్చేవారంటే కేవలం రూ.1000.
ఇవాళ మనం ఎంతిస్తున్నామంటే రూ.2250.
గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వానికి నెల, నెలా వచ్చే బిల్లు 490 కోట్లు రూపాయలు.
ఈ రోజు పెన్షన్‌ బిల్లు మనకొచ్చేది నెలకు ఎంతా అంటే 1421 కోట్ల రూపాయలు మనకొచ్చే బిల్లు.
నిజంగా ఒక్కసారి గమనించినటై్లతే ప్రతి అడుగులోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. పెన్షన్లు రాని పరిస్దితి, పెన్షన్ల కోసం పడిగాపులు కాసే పరిస్ధితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్‌ డెలివరీ చేసి అవ్వాతాతలతో చిరునవ్వులు చూసి పెన్షన్లు నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం.
08–07–2019న పెన్షన్‌ కానుకను మొదలుపెట్టాం.
15–08–2019న వాలంటీర్ల వ్యవస్ధకు నాంది పలికాం.
02–10–2019న విలేజ్‌ సెక్రటేరియ్, వార్డు సెక్రటేరియట్‌ వ్యవస్ధకు నాంది పలికాం.
04–10–2019న వైయస్సార్‌ వాహనమిత్ర అనే కార్యక్రమంతో సొంత ఆటో ఉన్న డ్రైవర్లకు,టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం.
10–10–2019న వైయస్సార్‌ కంటివెలుగు అని చెప్పి దాదాపుగా 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం, వారికి ట్రీట్మెంట్‌ ఇప్పించే కార్యక్రమం పూర్తి చేశాం.
15–10–2019న వైయస్సార్‌ రైతు భరోసా కార్యక్రమం. మనం చెప్పింది రూ.12500, ఇస్తామన్నది నాలుగేండ్లు, కానీ చేస్తా ఉన్నదేమిటంటే రైతులకు ఇస్తా ఉన్నది రూ. 13500, చేస్తా ఉన్నది 5 సంవత్సరాలు చేస్తాఉన్నాం. అందులో రెండో దఫా కూడా శ్రీకారం చుట్టాం, దాదాపు 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతా ఉంది.
17–10–2019న వైయస్సార్‌ నవోదయం అని చెప్పి టోటల్‌గా ఎంఎస్‌ఎంఈ యూనిట్స్‌కు లోన్స్‌ రీస్ట్రక్చర్‌ చేసే కార్యక్రమంలో భాగస్తులమయ్యాం.
08–11–2019 లో ఆగ్రిగోల్డ్‌ బాధితులకు దాదాపు రూ.264 కోట్ల రూపాయలు ఎవరైతే రూ.10 వేలు లోపు ఉన్నవాళ్లున్నారో వాళ్లకి కోర్టు అనుమతిచ్చిన మేరకు పదివేల లోపు డిపాజిట్లున్న బాధితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది.
14–11–2019 మనబడి నాడు నేడు శ్రీకారం చుట్టాం. ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి. జూలై నాటికి అక్షరాలు 45వేల స్కూళ్లకు గాను 15,700 స్కూళ్లకు జూలై నాటికి పూర్తిగా మనబడి నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలన్నీ మారబోతా ఉన్నాయి.
ప్రతిస్కూళ్లోనూ బ్లాక్‌బోర్డ్స్‌ మారబోతా ఉన్నాయి. బాత్రూమ్స్‌ వస్తా ఉన్నాయి. ఫెయింటింగ్స్, ఫినిషింగ్‌ మారబోతా ఉన్నాయి.
కాంపౌండ్‌ వాల్‌ వస్తుంది, ప్రతీ స్కూల్‌ ఇంగ్లిషు మీడియంగా రూపురేఖలు దిద్దుకుని పూర్తిగా మారబోయే కార్యక్రమం.

20–11–2019న వైయస్సార్‌ నవశకానికి సర్వేకి శ్రీకారం చుట్టాం. ఎలిజిబులిటీ క్రై టీరియాను పెంచాం.
ఇంతకముందు బియ్యం కార్డు ఉంటే గ్రామాల్లో నెలకు ఐదువేలరూపాయల అర్హత, పట్టణాలల్లో ఆరువేల రూపాయలు అర్హత ఉండేది.
ఇవాళ గ్రామాలల్లో అర్హత రూ.10వేలు చేశాం. పట్టణాలలో అయితే నెలకు ఏకంగా రూ.12వేలు చేశాం. పూర్తిగా రైస్‌ కార్డ్స్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, హౌసింగ్‌ అన్ని పథకాలకు నవశకం ద్వారా గ్రామవాలంటీరు వ్యవస్ధకు పదునుపెట్టి సర్వేలు మొదలుపెట్టాం.
21–11–2019 మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం.
01–12–2019లో ఆరోగ్యశ్రీ రూపురేఖల్ని కూడా పూర్తిగా స్వరూపం మార్చేశాం.
ఆశ్చర్యమేమిటంటే గత ప్రభుత్వంలో రూ.680 కోట్లు బకాయిలు పెట్టి నెట్వర్క్‌ ఆసుపత్రులకు డబ్బులివ్వని పరిస్ధితి ఉంటే… కనీసం ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునే దానికి ఎవరైనా నెట్‌వర్క్‌ ఆసుపత్రికి పోతే ప్రభుత్వం వారికివ్వాల్సిన బకాయిలు 8నెలలుగా పెండింగ్‌ ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించే పరిస్ధితి నుంచి ఆరోగ్యశ్రీ పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్‌ చేస్తూ… మే 18 వరకు ఎలాంటి బకాయిలు లేకుండా ఆరోగ్యశ్రీలో మొత్తం అప్‌టు డేట్‌ చేసిన పరిస్ధితి ఆరోగ్యశ్రీలో కనిపిస్తోంది.
ఆరోగ్యశ్రీలో ఇంకొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం,
వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమం తీసుకొచ్చాం.
ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు, వైద్యం చేయించిన తర్వాత ఇంట్లో రెస్ట్‌ తీసుకోవాలని అని అంటే రెస్ట్‌ కోసం కూడా నెలకి రూ.5వేలు డబ్బులిచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం .
దాదపుగా 1 లక్ష ఆరువేల మంది వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ది పొందారని చెప్పి గర్వంగా కూడ చెప్పగలుగుతా ఉన్నాం.
03–12–2019న వైయస్సార్‌ లా నేస్తం, 16–12–2019న దిశా యాక్టుకు సంబంధించిన , మహిళల భద్రతకు సంబంధించి , పూర్తిగా రూపురేఖలు మారుస్తూ దిశ యాక్టును తీసుకురావడం జరిగింది. ఈ రోజు 18 దిశా పోలీస్‌ స్టేషన్లు కనిపిస్తా ఉన్నాయి.
ఈ రోజు ఇద్దరు మహిళా ఆధికార్లు దానికి పూర్తిగా సూపర్‌వైజింగ్‌ బాధ్యతలు చేస్తా ఉన్నారు. వీళ్లద్దరూ కూడా చాలా గొప్పగా కూడా చేస్తా ఉన్నారు.
21–12–2019 నా పుట్టిన రోజు నాడున వైయస్సార్‌ నేతన్న నేస్తం అని చెప్పి ప్రతీ చేనేత కార్మికుడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. ఇంతకు ముందు మామూలుగా చేనేతలకు రూ.200 కోట్లు ఐదేళ్లలో కూడా ఇచ్చే పరిస్ధితి లేదు. ఇవాళ సంవత్సరానికి రూ.200 కోట్లు ఇస్తున్నాం. ఏకంగా 81 వేల మంది చేనేతలకు 24వేల రూపాయలు చేతిలో పెడతా ఉన్నాం.

03–01–2020 పశ్చమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి
ఫైలెట్‌ ప్రాజెక్టు 2వేల రోగాలతో ఆరోగ్యశ్రీతో ఫైలెట్‌ ప్రాజెక్టు మొదలుపెట్టాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఒక్కో జిల్లా పెంచుకుంటూ పోవాలి, కోవిడ్‌ వచ్చింది కాబట్టి కాస్తా వెనుకబడింది. త్వరలోనే దీన్ని మరలా ప్రారంభిస్తాం. ఈ 2000 రోగాలను ప్రతి జిల్లాకు తీసుకొని పోయే కార్యక్రమానికి మళ్లీ డేట్స్‌ ఇవ్వమని అడిగాం.
09–01–2020 అమ్మ ఒడి,
43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు ఏకంగా పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ రూ.15 వేల రూపాయలు తల్లుల చేతిలోకి ఇవ్వడం జరిగింది.
18–02–0220 వైయస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం అవ్వా తాతలకు మొదలుపెట్టాం, అది ఇంకా జరుగుతూ ఉంది. ఈ కోవిడ్‌ వల్ల కొంత వెనుకబడ్డా మరలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
24–02–2020 జగనన్న వసతి దీవెన అని చెప్పి ప్రతీ తల్లికి దాదాపు 15 లక్షల మందికి, పిల్లల చదువులు కోసం తల్లి అవస్ధలు పడకూడదని చెప్పి, వసతి కోసమని చెప్పి ప్రతి పిల్లాడికి 20వేల రూపాయలివ్వాలని చెప్పి, అదీ రెండు దఫాల్లో ఇవ్వాలని చెప్పి మొదటి దఫా దాదాపు 1200 కోట్ల రూపాయలు కేటాయించి, ప్రతీ తల్లికీ ఇవ్వడం జరిగింది. రూ.10వేలు చొప్పున 24–02–2020న ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్‌ చదువుతున్న
చదువుతున్న వాళ్లకైతే రూ.20 వేలు దాంట్లో రూ.10వేలు ఇచ్చాం. పాలిటెక్నిక్‌ చదువుతున్నావారికి రూ.15000 దాంట్లో రూ.7500 కూడా ప్రతి తల్లికీ కూడా ఇవ్వడం జరిగింది.

2020–21 కి సంబంధించి కూడా ఏకంగా కేలెండర్‌ రిలీజు చేశాం.
ఏ నెల ఏ పధకం అమల్లోకి వస్తుంది, ఏ నెల ఏ పధకం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తోడుగా ఉండే విధంగా ఏకంగా క్యాలెండర్‌ ఇవ్వడం జరిగింది.

2020–21 సంక్షేమ కాలెండర్‌..

ఏప్రిల్‌ 2020లో పొదుపు సంఘాలకు సంబందించి వడ్డీలేని రుణాలు ఏకంగా రూ.1400 కోట్లు ఇవ్వగలిగాం.
24వ తేదీ వైయస్సార్‌ సున్నా వడ్డీ పధకం ప్రారంభం. రూ.1400 కోట్లు విడుదల.
8.7 లక్షల స్వయం సహాయ సంఘాలకు చేయూత.
దాదాపు 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం.

28–04–2020 విద్యాదీవెన కింద రూ.4000 కోట్లు ప్రతి పిల్లాడికీ కూడా ఎవరైతే చదువుతా ఉన్నారో… ఇంతకు ముందు ప్రభుత్వం పిల్లల చదువులు కోసం డబ్బులివ్వాల్సింది పోయి పెండింగ్‌ పెడితే , రూ.1880 కోట్లు బకాయిలు తీరుస్తూ… 4300 కోట్లు రూపాయలు వైయస్సార్‌ విద్యా దీవెన కింద ఇచ్చాం. ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదేమో మొట్టమొదటిసారిగా అప్‌టుడేట్‌గా, మార్చి క్వార్టర్‌ వరకు ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలకు లేకుండా నేరుగా కాలేజీలకు డబ్బులివ్వడం, తర్వాత క్వార్టర్‌ నుంచి తల్లులకే నేరుగా డబ్బులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైయస్సార్‌ విద్యా దీవెన కూడా ఏప్రిల్‌లోనే అయిపోజేశాం.
వడ్డీలేని రుణాలు 1400 కోట్లు ఏప్రిల్‌లోనే అయిపోజేశాం.
06–05–2020 వైయస్సార్‌ మత్స్యకారభరోసా ఇది కూడా అయిపోయింది.
15–05–2020 మొన్నేనే రైతు భరోసా రెండోదఫా కూడా మొదలుపెట్టేశాం. రైతులుకు రూ.7500 ఇచ్చే కార్యక్రమం కూడా అయిపోయింది.
22–05–20202 అంటే మొన్న ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రీస్టార్స్‌అనే ప్రోగ్రాం కింద చిన్న, చిన్న కంపెనీలకు తోడుగా ఉండేందుకు గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు మొత్తం 960 కోట్లు రూపాయలు పెట్టిందో, వాటిని మొత్తం ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ మన ప్రభుత్వం చేస్తా ఉంది. గత ప్రభుత్వం బకాయిలును మన ప్రభుత్వం ఇస్తా ఉంది. రెండు నెలల్లో ఆ బకాయిలు ఇస్తామని చెప్పామో .. మే నెలలో మొదటి దఫా రూ.450 కోట్లు రూపాయలు రిలీజ్‌ చేశాం. ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ కార్యక్రమంలో అక్కడ చిన్న, చిన్న కంపెనీలకు మేలు జరిగే విధంగా వాళ్లకు మూడు నెలలు పాటు ఫిక్స్‌డు ఛార్జీలు కరెంటు బిల్లులు ఏదైతే కట్టాలో వాటిని రద్దు చేశాం.
ఇలా మే నెలలో అర్చకులకు, ఇమామ్‌లకు, మౌజంలకు, పాస్టర్లకు వన్‌ టైం ఫైనాన్షియల్‌అసిస్టెన్స్‌ కింద రూ.ఐదువేలు మే మాసంలో 26వ తారీఖున ఇవ్వబోతాఉన్నాం.
మే 30 వ తేదీన రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించబోతున్నాం.
జూన్‌ నెలలో 4వ తేదీన వాహనమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం.
మేనిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం జూన్‌ 10న వాళ్లకీ రూ.10వేలు ఇవ్వబోతున్నాం.
17–06–2020న మరలా రెండోసారి నేతన్న నేస్తం..చేనేత కార్మికులుకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదొక్కటే కాకుండా గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బిల్లులు బకాయిలు కూడా పూర్తిగా చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మనం ఈ సంవత్సరం ఆప్కోకి సంబంధించి మాస్కులు తయారు చేసేదానికి కొనుగోలు చేసిన బట్టకు సంబంధించిన డబ్బులు కూడా కూడా 17–06–2020న ఇవ్వబోతా ఉన్నాం.
17–06–2020నవైయస్సార్‌ కాపునేస్తం అని చెప్పి ప్రతి అక్కకూ తోడుగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం.
45 యేళ్ల నుంచి 60 యేళ్ల వయసులోపు ఉన్న ప్రతి కాపు అక్కకూ రూ.15వేలు ఇచ్చే కార్యక్రమం.
29–06–2020న ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రెండో విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ మరో రూ.400 కోట్లకు పైగా ఇస్తాఉన్నాం.
జూలై 1 తారీఖున 104,108 కుసంబంధించి 1060 అంబులెన్స్‌లు ఒకేసారి రోడ్డుమీద జెండా ఊపి కొత్త ఆంబులెన్స్‌లు లాంbŒ∙చేయబోతా ఉన్నాం.
08–07–2020 అంటే నాన్న పుట్టిన రోజున ఏకంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
29–07–2020 న వడ్డీలేని రుణాలకు సంబందించి రైతులకు వడ్డీలేని రుణాలను, వారికి వైయస్సార్‌ సున్నావడ్డీ పథకాన్ని వర్తింపజేస్తా ఉన్నాం.
ఇక ఆగష్టులో చేయబోయే కార్యక్రమాలు 03–08–2020న విద్యాకానుక స్కూలుకుపోయే ప్రతి పిల్లాడు.. దాదాపు 40 లక్షల మంది స్కూలు పిల్లలకు పూర్తిగా ఉచితంగా బ్యాగు, స్కూలుబట్టలు, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్,షూ, సాక్స్‌లతో సహా ప్రతీ పిల్లాడికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.
ఆగష్టు 9న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతాఉన్నాం. గిరిజన కుటుంబాలకు మంచి జరగాలన్న ఆరాటంతో చేస్తా ఉన్నాం.
ఆగష్టు 12న వైయస్సార్‌ చేయూత అని చెప్పి ప్రతి ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం 45 యేళ్ల వయను నుంచి 60 యేళ్లు వయస్సున్న ప్రతీ అక్కకూ కూడా ఆ ఒక్క రోజునే 18,750 రూపాయలు, ఏదైతే మేనిఫెస్టోలో 75,000 రూపాయలు ఈ నాలుగేళ్లలో ఇస్తామని చెప్పామో… దాని కోసం ప్రతీ అక్కకూ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.

ఆగష్టు 19న జగనన్న వసతి దీవెన కింద మనం చేసే కార్యక్రమానికి మరలా పదివేలిచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్‌ చదువుతా ఉన్న పిల్లల తల్లలకు రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాఉన్నాం.
అదే ఆగష్టు 26న ఏకంగా 15 లక్షల ఇళ్లు కట్టడానికీ శ్రీకారం చుడతా ఉన్నాం.
సెప్టంబరు 11వ తేదీన పొదుపు సంఘాల్లో ఉండే ప్రతి అక్క, చెల్లమ్మకు తోడుగా ఉండేందుకు ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో నాలుగేళ్లలో వాళ్లకి మేలు చేస్తామని, నాలుగు దఫాల్లో ఇస్తామని చెప్పామో ఆ మొదటి దఫా 11 సెప్టంబరు నాడు దానికి శ్రీకారం చుట్టాం.
25 సెప్టంబరు నాడు విద్యాదీవెన కింద డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లల ఫీజులు కోసం తల్లులకే డబ్బులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ తల్లులకే అందించనున్నాం.
పిల్లలకోసం నేరుగే తల్లులే కాలేజీలుకు వెళ్లి ఫీజులు కట్టి పిల్లలు బాగా చదువుతున్నారా, వసతులు బాగా ఉన్నాయో లేదో తెలుసుకునే కార్యక్రమం కోసం శ్రీకారం చుడుతా ఉన్నాం.
అక్టోబర్‌లో రెండో విడత రైతుభరోసా కింద రైతులకు రూ.4000 ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం.
అక్టోబరులో చిరు వ్యాపారులుకు జగనన్న తోడు కార్యక్రమం కింద చిన్న, చిన్న షాపులు, పుట్‌పాత్‌ మీద వ్యాపారం చేసుకునే వాళ్లు, కులవత్తులు చేసుకుని ఇబ్బంది పడేవాళ్ల కోసం ఏకంగా రూ.10వేలు నేరుగా వారి చే తికే ఇచ్చి సున్నవడ్డీ కింది కట్టుకునే విధంగా వారి చేతికి కార్డు ఇచ్చి, ప్రభుత్వమే వడ్డీ కట్టే విధంగా ఏకంగా పదిలక్షల మందికి మేలు జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం.
నవంబర్‌లో విద్యాదీవెన,డిసెంబరులో అగ్రిగోల్డ్‌కు జనవరి 9 తేదీన మరలా అమ్మఒడి కార్యక్రమం, ఫిబ్రవరిలో మరలా విద్యాదీవెన, మరలా వసతి దీవెన, మార్చిలో మళ్లీ వడ్డీలేని రుణం పొదుపు సంఘాలకు సంబంధించిన వాళ్లకు డబ్బులిచ్చే కార్యక్రమం.

ఇంత పద్ధతిగా డేట్స్‌తో సహా నెలల వారిగా ఏ కార్యక్రమం ఎప్పుడు చెయ్యబోతున్నామో అని చెప్పి , ఆ దిశగా ఆలోచన చేసి, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతివాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలని తపన, తాపత్రయం పడిన పరిస్దితి బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండకపోవచ్చు. ఒకసారి జూన్‌ 2019న మే 30 మన ప్రభుత్వం ఏర్పడింది. జూన్‌ నుంచి ఈ నెల 20వ తారీఖు దాకా చూసుకుంటే ఏకంగా ఎంతమందికి లబ్ది జరిగిందనేది చూసుకుంటే 3,57,51,612 మంది లబ్దిదార్లు వీళ్ల కోసం మనం ఖర్చు చేసింది రూ.40,139 కోట్లు. బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడూ జరిగి ఉండదేమో. అంత గొప్పగా ఖర్చు చేశాం. ఇందులో బీసీలు ఎంతమంది అని చూసుకుంటే 1,78,42,048 మంది ఉట్టి బీసీ కులానికి సంబంధించిన వాళ్లు, వీళ్ల కోసం మనం ఖర్చు చేసిందెంతని చూసుకుంటే రూ. 19,298 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఎస్సీలు ఎంత మంది అని చూస్తే.. 61,26,203 ఎస్సీలుంటే వారి కోసం మనం ఖర్చు చేసింది రూ. 6332 కోట్లు అని గర్వంగా చెప్పగలుగుతున్నాం.
ఎస్టీలైతే 18,39,451 మంది ఉంటే వీళ్ల కోసం మనం ఖర్చు చేసింది రూ. 2108 కోట్లు అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మైనార్టీస్‌ 18,61,863 మందైతే వీళ్ల మీద రూ. 1701 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గర్వంగా చెప్పగలుగుతాం. ఇద ఇతరులైతే 77,47,889 మంది వీళ్లకోసం ఖర్చు చేసిందీ రూ.10,462 కోట్ల రూపాయలు. మొత్తమ్మీద 3 కోట్ల 57 లక్షల 51 వేల 614 మంది లబ్దిదార్లు రూ.40,139 కోట్లు ఖర్చు చేశామనంటే నిజంగా సంక్షేమంలోఇంత రివల్యూషనరీగా చేసిన పరిస్ధితి బహుశా ఎప్పుడూ ఉండదేమో. ఈ సారి 30 వ తారీఖు వచ్చేసరికే మన మేనిఫెస్టోనే చూపించి, ఇది మన మేనిఫెస్టో, మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం మీరే టిక్కులు పెట్టండి అని కూడా చెప్తాం. ఏమేం చేసినాం అనేది కూడా కలర్‌ కోడింగ్‌ ఇమ్మని చెప్తా ఉన్నాను. ఇవన్నీ జరగాయా లేదా అని చెప్పి మీ గుండెల మీద మీరే చేయి వేసుకుని అవన్నీ జరిగాయా లేదా మీరే ఆలోచన చేయండి అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోనే పంపించే కార్యక్రమం చేద్దామని చెప్పడం జరిగింది. సంక్షేమం కానీ, వ్యవస్ధలోకి మార్పు తీసుకొచ్చే గవర్నెన్స్‌లో కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా దేవుని దయతో మీ అందరి చల్లని దీవెనలతో గొప్పగా చేయగలగుతా ఉన్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ వీటిలో కూడా ఇంకా మార్పులు చేస్తే, ఇంకా ఏదైనా గొప్పగా చేసే పరిస్ధితి ఉంటుందని చెప్పి మీరేదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు, సూచనలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ… మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మీకు మైకు పంపిస్తా..మీ సూచనలు మీ సలహాలు మీరు చెప్పండి. నేను నోట్‌ చేసుకుంటా అవన్నీ ఇంప్లిమెంట్‌ అయ్యేట్టుగా అడుగులు ముందుకు వేస్తానని తెలియజేస్తా ఉన్నాను అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

ఆ తర్వాత పలువురు సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు,నిపుణులతో మాట్లాడారు.

స్మైలి. వెంకటాయపాలెం. సచివాలయం
– ‘జగన్‌ గారు తన పాదయాత్రలో చాలా మంది పేదల కష్టాలు చూసి, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధి ఉండాలని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. నేను అంతకు ముందు కేవలం ఇంటికే పరిమితం అయ్యాను. సచివాలయ వ్యవస్థలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు ఉంటే వారిలో 50 శాతం మహిళలకు ఇచ్చారు. ఇందుకు ఎంతో గర్వపడుతున్నాం. సంతోషంగా ఫీలవుతున్నాం. మొదట్లో వలంటీర్లను చాలా మంది తక్కువగా చూశారు. కానీ మేము అందిస్తున్న సేవలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఇవాళ యావత్‌దేశం మావైపు చూస్తోంది. కరోనా సమయంలో కూడా ఎంతో పని చేశాం. మాకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలు. మాపై నిందలు కూడా వేశారు. ఇంట్లో ఆడవారు లేనప్పుడు తలుపు తడుతున్నామని ప్రచారం చేశారు. అప్పుడు మనోవేదనకు గురై ఉద్యోగం మానేయాలని కూడా అనుకున్నాం. కానీ మా వెనక జగనన్న ఉన్నాడన్న ధైర్యంతో ముందకు వెళ్లాం. అందుకే ఇవాళ మేమంతా జగనన్న వారియర్స్‌గా నిల్చాం. ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి’.

ఫర్జాన, ధర్మవరం. అనంతపురం
– ‘నేను వార్డు వలంటీర్‌గా పని చేస్తున్నాను. మా ధర్మవరం నేతన్నలకు ప్రసిద్ధి. కానీ ఆ రంగం పూర్తిగా కుంటు పడింది. చేనేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. ఆ సమయంలో మీరు పాదయాత్రలో వచ్చారు. హామీ ఇచ్చారు. కానీ నేను మనసులో అనుకున్నాను. కానీ మీరు అధికారం చేపట్టిన వెంటనే 6 నెలల్లో వచ్చారు. మాట నిలబెట్టుకున్నారు. అంతే కాకుండా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చారు. నేతన్నలకు సమస్య ఉంది. చెప్పాలో కూడా తెలియదు. మా దగ్గర చేనేత కార్మికుల్లో ఇంటికి ఒకరికే సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇంట్లో ఎందరు నేస్తే, వారందరికి సహాయం చేయమని కోరుతున్నాం. మీ పుట్టిన రోజు మా ధర్మవరం వచ్చి, నేతన్న నేస్తం అమలు చేశారు. అందుకు మీకు రుణపడి ఉంటాము. ఇవాళ లంచం లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు. పథకాలు కూడా అందుతున్నాయి’.

నాగలక్ష్మి, కాకినాడ రూరల్‌ మండలం. తిమ్మాపురం.
– ‘నేను వలంటీర్‌ను. మీరు మా అన్న. ఈ వ్యవస్థ ఒక మంచి ఆలోచన. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో గతంలో తెలిసేది కాదు. నాదీ అదే పరిస్థితి. కానీ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎంతో సేవ అందుతోంది. నా క్లస్టర్‌లోనే 60 ఇళ్లున్నాయి. వారికి ఏం కావాలన్నా మేము చేసి పెడుతున్నాం. ఏది కావాలన్నా 72 గంటల్లోనే పరిష్కరిస్తున్నారు. ఈ ఉద్యోగం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. కేవలం పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేశారు. కానీ అందులో వాస్తవం లేదు. అందుకే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అదే విధంగా మూటలు మోస్తామన్నారు. కానీ అవేం లేకుండా మేము పని చేస్తున్నాం. ఈ ఉద్యోగాన్ని చాలా గౌరవంగా చేసుకుంటున్నాం’.
‘మేము ప్రజలకు సేవ చేస్తుంటే, మీరు దక్కాల్సిన గౌరవం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించే ఆనందం మేము ఎప్పటికీ మర్చిపోలేం. వారు మిమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు. కరోనా సమయంలో నాలుగుసార్లు సర్వే చేశాం. అప్పుడు కూడా మేము భయపడలేదు. ఎందుకంటే మీరు ఎంతో సపోర్టు చేశారు. రూ.50 లక్షల ఇన్సూరెన్సు ప్రకటించారు. అందుకే మేము చాలా ధైర్యంగా పని చేశాం’.

హేమంత్‌రెడ్డి, విజయవాడ. 5వ వార్డు
– ‘గ్రామ స్థాయి నుంచి మార్చు ఆశించి, ఆ దిశలో అన్నీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నారు. గతంలో మమ్మల్ని వెక్కిరించిన వారే ఇవాళ తమకు పనులు చేసి పెట్టాలని కోరుతున్నారు. మా వెనక ఉన్న ‘రియల్‌ హీరో’ మీరు’.
‘మీరు అధికారం చేపట్టిన వెంటనే పెన్షన్లు పెంచారు. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి ఇస్తుంటే, వారు ఎంతో సంతోషిస్తూ, కలకాలం మీరు, మీ ప్రభుత్వం ఉండాలని కోరుతున్నారు. ఆ విషయం మీకు చెప్పాలనే ఇక్కడకు వచ్చాను. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం’.

శ్రావణి, పడమట. 201 వార్డు. విజయవాడ. మహిళా పోలీస్‌
– ‘ప్రభుత్వ ఉద్యోగం మీ వల్ల వచ్చింది. దిశ చట్టం ఎంతో ప్రత్యేకం. ఇవాళ అనేక రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. మహిళలకు సత్వర న్యాయం చేస్తున్నారు. దిశ చట్టం వచ్చాక రెండు కేసుల్లో డెత్‌ సెంటెన్స్‌ వచ్చింది. ఇవాళ మహిళలు పగలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంది. కానీ ఈ చట్టం మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. మా వెనక జగనన్న ఉన్నాడు అని అందరికీ తెలిసింది. మీరు గతంలో ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపులను 33 శాతం తగ్గించారు. ఇంకా పలు చర్యలతో మద్యపానం తగ్గింది. ఒక వైపు ఈ నిర్ణయం, మరోవైపు దిశ చట్టం వల్ల నేరాలు తగ్గాయి. మీ ప్రభుత్వంలో ఏ చట్టం చేయకుండానే 50 శాతం టాప్‌ పోస్టుల మహిళలకు ఇచ్చారు’.

ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీఎం, తమది ఆడవారికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం అని చెప్పారు. ప్రతి పథకంలో వారు ముందుండాలన్న ఆయన, లబ్ధిదారుల్లో కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని, నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామని గుర్తు చేశారు.

కుసుమకుమారి, తూర్పు గోదావరి
– ‘మా సంఘానికి సున్నా వడ్డీ రూ.28 వేలు వచ్చాయి. అది కూడా కరోనా సమయంలో వచ్చాయి. కిరాణం సామాను తెచ్చుకున్నాం. జగనన్నకు రాష్ట్ర ప్రజల మీదే ప్రేమ అనుకున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించడమే కాకుండా, ఇక్కడ ఉన్న వలస కూలీలను పంపించారు. దీన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు ఎంతో భరోసా ఇచ్చారు. వారు మిమ్మల్ని ఎంతో గుర్తు చేస్తున్నారు. మీరు మా తరం మాత్రమే కాకుండా, మా పిల్లల సమయంలో కూడా సీఎంగా ఉండాలి. విశాఖలో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం జరిగితే, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చారు. మా జిల్లాలో పుష్కరాల్లో ఒక నేత వైఖరి వల్ల ఎందరో చనిపోతే, రూ.10 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఇచ్చారో లేదో కూడా తెలియదు’.
‘మీరు ప్రతి ఆడపిల్లకు పసుపు కుంకుమ ఇచ్చినట్లు సహాయం చేస్తున్నారు. దీంతో గతంలో మా అవసరాల కోసం మా భర్తలను అడిగే వాళ్లం. కానీ ఇప్పుడు వారే మమ్మల్ని అడుగుతున్నారు. జగనన్న మహిళా పక్షపాతి అంటున్నారు’.

లీలా కృష్ణ, ఏలూరు.
ఆటో డ్రైవర్ల సంఘం నాయకుడు
– ‘మీరు మాకు రూ.10 వేలు ఇచ్చినందుకు ఎంతో సంతోషం. దీని వల్ల మా కష్టాలు తీరాయి. మా కోసం ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు. అందుకు ఎంతో రుణపడి ఉంటాను’.

మాంఛూ ఫెర్రర్, ఆర్‌డీటీ. అనంతపురం
– ‘గ్రామ స్వరాజ్య నిధి ఏర్పాటు చేసి, 20 ఏళ్ల నుంచి గ్రామానికి కావాల్సిన అవసరాలు కేవలం వడ్డీతో తీరుస్తున్నాం. ఇప్పుడు గ్రామాల సమస్యలు పరిష్కారం కాగా, వేరే ఊళ్ల సమస్యలు కూడా తీరుస్తున్నారు. ఇవాళ మీరు గ్రామస్థాయిలో కూడా పరిపాలనలో మార్పు చేస్తూ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. వలంటీర్లను నియమించారు. కోవిడ్‌ సమయంలో వారు ఎంతో సేవలందించారు. అది కళ్లారా చూశాం. గ్రామస్థాయిలో మార్పులు రావలంటే అధికారంతో పాటు, నిధులు కూడా కావాలి. అవి ఉంటే తప్ప ఆ ఉత్సాహం, బాధ్యత వస్తాయి. అప్పుడే మార్పు కూడా సాధ్యం’.

ఈ సందర్భంగా మరోసారి మాట్లాడిన సీఎం, అనంతపురం జిల్లాలో ఫెర్రర్‌ కుటుంబం స్థాపించిన ఆర్‌డీటీ గురించి తెలియని వారెవరూ ఉండరని, ఆ కుటుంబం ఎంతో సేవ చేస్తోందని చెప్పారు.

మల్లారెడ్డి, అనంతపురం
– ‘నేను ఆర్‌డీటీలో 40 ఏళ్లుగా అభివృద్ధి కార్యకర్తగా పని చేస్తున్నాను. మా దృష్టిలో అభివృద్ధి అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. చాలా కాలం క్రితం అభివృద్ధి చేసినా తెలియలేదు. ఎందుకంటే అప్పుడు ప్రజల్లో చైతన్యం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఉద్యోగాల్లో జవాబుదారీతనం వచ్చింది. జగనన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి, పని చేయక తప్పదు అని అందరూ భావిస్తున్నారు’.
‘సంక్షేమ పాలన ద్వారా ఇప్పటి వరకు అణగారిన వర్గాలుగా ఉన్న వారు కూడా పాలకులవుతారు. వారి చేతుల్లో అధికారం పెట్టడం జరుగుతుంది. ప్రజల్లో చైతన్యం వస్తే గ్రామం బాగు పడుతుంది. గ్రామాలు బాగు పడితేనే మండలాలు, తద్వారా జిల్లాలు, రాష్ట్రం బాగు పడుతుంది. మీకు ఎవరు ఆలోచన ఇస్తున్నారో తెలియదు. చాలా చక్కగా పని చేస్తున్నారు’.

అవినీతికి తావు లేదు
అనంతరం మరోసారి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘గ్రామ సచివాలయాలు మొదలు, వ్యవస్థలో మార్పు, శాచిరేషన్‌. ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. నా స్థాయి నుంచి కలెక్టర్ల వరకు 50 శాతం, ఆ తర్వాత గ్రామ స్థాయి వరకు ఎక్కడా లంచం అనేది ఉండకూడదన్నదే లక్ష్యం. టెండర్ల ప్రక్రియలో కూడా మార్పు చేశాం. జ్యుడీషియల్‌ రివ్యూ. పబ్లిక్‌ డొమేన్‌లో పెట్టడం. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌. ఎల్‌–1గా నిల్చిన వారి నుంచి మళ్లీ టెండరింగ్‌. ఆ విధంగా రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇప్పటి వరకు మొత్తం రూ.2082 కోట్లు ఆదా అయ్యాయి. నీటి పారుదల శాఖలో రూ.1139 కోట్లు, పంచాయితీ రాజ్‌ శాఖలో రూ.197 కోట్లు, టిడ్కోలో రూ.361 కోట్లు, జెన్‌కోలో రూ.211 కోట్లు, విద్యా శాఖలో రూ.175 కోట్లు ఆదా అయ్యాయి’.
‘ఇసుక, మద్యంలో అవినీతికి తావు లేకుండా ప్రత్యేక నెంబరు. ఎస్‌ఈబీ ఏర్పాటు. అందులో యువ ఐపీఎస్‌ ఆఫీసర్ల నియామకం. గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడి జరిగింది’ అని చెప్పారు.

సరోజ, గుంటూరు కార్పొరేషన్, సంక్షేమ కార్యదర్శి
– ‘ఇవాళ ఇంత మందిని ఇక్కడ చూస్తున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. వలంటీర్లతో కలిసి పని చేస్తున్నందుకు బాగా అనిపిస్తోంది. 31వ తేదీ సాయంత్రమే సచివాలయాల్లో నగదు పంచుకుని, మర్నాడు పొద్దున్నే ఇళ్లకు వెళ్తున్నాం. అలా పెన్షన్‌ ఇవ్వడానికి వెళ్తుంటే వారు ఎంతో సంతోషిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో పోర్టబిలిటీ వల్ల ఎవరు, ఎక్కడ ఉన్నా పింఛను ఇవ్వడం నిజంగా చాలా గొప్ప పని. లబ్ధిదారులు మాకు ఇస్తున్న గౌరవం, అభిమానం నిజంగా మీకు దక్కాలి. వలంటీర్లతో కలిసి ఇళ్లకు వెళ్లి సేవలందిస్తున్నాం. అందరం కలిసి చాలా మోటివ్‌గా, స్పోర్టివ్‌గా ముందుకు వెళ్తున్నాం. కోవిడ్‌ సమయంలో రేషన్‌తో పాటు, రూ.1000 ఇచ్చారు. దీంతో చాలా మంది తమకు రూ.3250 వచ్చాయని సంతోషించారు. ఇంకా, కేవలం రైస్‌ కార్డు ఉన్న వారికే కాకుండా రేషన్‌ కార్డు ఉన్న వారికి కూడా ఆ సహాయం చేశారు. దీంతో చాలా మంది సంతోషించారు’.
‘కోవిడ్‌తో కలిసి జీవించక తప్పదని ఆరోజు మీరంటే చాలా మంది అవహేళన చేశారు. కానీ ఇవాళ అదే మాట ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు, అమెరికా అధ్యక్షుడు, పీఎం వరకు చెబుతున్నారు. మీ కింద పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం’.

కిక్‌లా పని చేస్తాయి
ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడిన సీఎం, ‘సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తుంటే, ఆ లబ్ధిదారులు పొందే ఆనందం, వారి దీవెనలు.. ఒక కిక్‌లా పని చేస్తాయి. అవి ఉన్నంత వరకు ఈ వ్యవస్థలో అవినీతికి చోటు ఉండదని నా నమ్మకం’ అని చెప్పారు.

కృష్ణ, కర్నూలు
– ‘నా కొడుకు తిరుపతిలో చదువుతున్నాడు. నా భర్త ఆటో డ్రైవరు. నేను టైలరింగ్‌ చేస్తాను. నా కొడుకును చదివిస్తానో లేదో అనుకున్నాను. కానీ నీవు నాకు కొండంత అండగా ఉండి, సహాయం చేస్తున్నావు. పెద్దబ్బాయికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. నా చిన్న కొడుక్కి ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చారు. నా కూతురు కస్తూరిబా స్కూల్‌లో చదువుతోంది. నీవల్లనే ఇదంతా. నీ మేలు చచ్చేంత వరకు మరువలేను. నీకు కృతజ్ఞతలు’.

«శ్రీలక్ష్మి. గుంటూరు
– ‘నాకు ఇద్దరు బిడ్డలు. ఏ అండా లేదు. కానీ నీవు మా పిల్లలకు ఒక మేనమామలా నిల్చి ఆదుకున్నావు. అమ్మ ఒడి ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఒక మేనమామలా బాధ్యత తీసుకున్నావు. ఇన్ని చేస్తూ కూడా మా వంటి పేదలకు ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా, మాకు కల అయిన ఇంటిని కూడా నిర్మించి ఇస్తానన్నావు. ఇళ్లలో అవసరాలు తెలుసుకుని తీర్చేలా వలంటీర్లను నియమించావు. ఇది గతంలో ఎవ్వరూ చేయలేదు. అన్నా రాఖీ కడతాను’.

ఈ వ్యవస్థ పిల్లర్ల వంటిది: సీఎం
‘పరిపాలన–సంక్షేమం బాగా పని చేయాలన్నా పిల్లరు గ్రామ వలంటీర్లు, సచివాలయాలు. అందువల్ల ఏనాడూ ఈ వ్యవస్థలోకి అవినీతి రావొద్దు. శాచురేషన్‌ పద్ధతిలో పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం నిరంతరాయం పని చేస్తాను. ఆ దిశలోనే పని చేస్తాను. మీ మాటలను ఒక స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇంకా బాగా పని చేయడానికి ప్రయత్నిస్తాను’.

శైలజ, నెల్లూరు జిల్లా
– ‘మిమ్మల్ని సీఎంగా చూడాలని ఎన్నో ప్రార్థనలు చేశాం. ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమాలు గతంలో ఎవరూ చేయలేదు. అమ్మ ఒడి ద్వారా పిల్లలను చదివించేలా చేస్తున్నారు. 38 లక్షల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేశారు. ఎక్కడా వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాకు రూ.3 లక్షల రుణం మంజూరైతే వైయస్సార్‌సీపీకి చెందిన దాన్నని చెప్పి తీసేశారు’.

లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ‘సంక్షేమ క్యాలెండర్‌–2020’ విడుదల చేశారు. అదే విధంగా గ్రామ, వార్డు వలంటీర్లకు లెర్నింగ్‌ కోసం ఒక యాప్‌ కూడా ఆయన ఆవిష్కరించారు. ఇంకా సచివాలయాల్లో నెలవారీగా కార్యక్రమాలపై మరో క్యాలెండర్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. అందులో నెలవారీతో పాటు, సంవత్సరం కార్యకలాపాల వివరాలు కూడా ఉన్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా ఒక శాఖ ఏర్పాటు చేశామని, జిల్లాలలో ప్రత్యేకంగా ఒక జేసీ నియామించామన్న సీఎం, వీటన్నింటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *