విద్యా విధానంపై నిపుణుల కమిటీ సమావేశం

విద్యావిధానానికి నిర్ధిష్ఠమైన రూపుతో పాటు సంప్రదాయ విద్యను కూడా సమాంతరంగా అందించే దిశలో నిపుణుల సూచనలు ఉండాలి : మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో విద్యావిధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న ధ్యేయంతోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ఎక్స్ పర్ట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యావిధానాల్లో సంస్కరణలను తీసుకురావడానికి తన హయాంలో కమిటీ ఏర్పాటు చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో మూడు కోట్ల మంది ప్రజల కష్టాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. సమాజాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తించడం జరిగిందన్నారు. అందులో భాగంగా తొలి కేబినెట్ సమావేశంలోనే విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసే దిశలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యాసంస్కరణలను చేయడానికి తగిన సిఫారసులు చేయాలని కోరడం జరిగిందని మంత్రి అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కమిటీ తగిన సిఫారసులు చేయాలని, వాటి అమలుకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల అమలులో పెద్దపీట వేస్తున్నామన్నారు. శాసనసభలో సభ్యులు నియామావళికి కట్టుబడి లేకపోతే ఎటువంటి చర్యలు అయినా తీసుకోవడానికి వెనకాడవద్దని స్పీకర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం గా నిలుస్తుందని మంత్రి అన్నారు. కమిటీకి కావలసిన నిధులను, మౌలిక సదుపాయాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. విద్య ద్వారా జీవనోపాధి మాత్రమే కాదని, జీవితం ఎలా కొనసాగించవచ్చో తెలిపే విధానం ముఖ్యమని మంత్రి వెల్లడించారు. నవరత్నాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలైనంత తొందరగా సంస్కరణలను తీసుకురావడం ద్వారా ప్రజల్లో నమ్మకం బలపడుతుందన్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అన్న పేరు ముఖ్యమంత్రి ఉందని, ఆ దిశలో విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న విద్యావిధానాన్ని అధ్యయనం చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు 15 వేల రూపాయల ఆర్థిక చేయూతనందిచడం ద్వారా బడి బయటి పిల్లలను తిరిగి బడికి పంపించే కార్యక్రమాన్ని చేపట్టగలిగామన్నారు. గత ఏడాది కంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు మెరుగయ్యాయన్నారు. విద్యావిధానానికి ఒక నిర్ధిష్ఠమైన రూపు తీసుకురావడంతో పాటు సంప్రదాయ విద్యను కూడా సమాంతరంగా అందించే దిశలో సూచనలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రాథమిక శిక్షా అభియాన్ ద్వారా విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర విద్యా రంగంలో సమగ్ర శిక్షా అభియాన్ అమలు జరిగేలాగా కమిటీ తగిన సిఫారసులు చేయడం జరగాలని మంత్రి అభిలాషించారు.

ఎక్స్ పర్ట్ కమిటీ ఛైర్మన్ ఐఐఎస్ సీ బెంగుళూరు ప్రొఫెసర్ ఎన్. బాలకృష్ణన్ :విద్యావిధానాల్లో సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎక్స్ పర్ట్ కమిటీ ఛైర్మన్ ఐఐఎస్ సీ బెంగుళూరు ప్రొఫెసర్ ఎన్. బాలకృష్ణన్ అన్నారు. లక్ష్యాలు నిర్ధేశించుకుని గమ్యాన్ని చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో విద్యావిధానం లోటుపాట్ల వల్ల ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి పలువురు నిపుణులు ఏటా వెళ్ళి అక్కడ పని చేస్తున్నారన్నారు. 21వ శతాబ్ధంలో చదువులను అభిలాషించేలా ఉండాలని, అదే సందర్భంలో సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. బోధనా విధానాల్లో సంస్కరణలను తీసుకురావడంతో పాటు నిరంతర అభ్యసనం ఉండాలన్నారు. స్థిరమైన జీవన విధానం, అభివృద్ధే లక్ష్యంగా విద్యావిధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యావిధానాల వివరాలను పూర్తిగా అందించాలని, వాటిపై సమగ్ర అధ్యయనం చేసి నిపుణుల కమిటీలో చర్చించి తగిన సిఫార్సులను చేయగలుగుతామన్నారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డా. సుధా నారాయణ మూర్తి :గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను దృష్టిలో ఉంచుకొని విద్యావిధానాల సంస్కరణలు ఉండాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డా. సుధా నారాయణ మూర్తి అన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, అర్హత గలిగిన బోధనా సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఏ స్థాయిలో ఉన్న ప్రజానీకమైనా తలసరి ఆదాయం కంటే తక్కువ ఆదాయం పొందే కుటుంబాల వారైనా వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఆశిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనంలో పాఠశాలలో మౌలిక సదుపాయాల లేమి వల్ల 13 సంవత్సరాల వయసు దాటిన ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారని తెలుస్తోందన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తర్వాత విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని మంచి ఆహారాన్ని అందించేలాగా కృషి కొనసాగించాలన్నారు. అదే విధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. భవనాలు కాదు వాటి నిర్వహణ ముఖ్యమని అదే తరహాలో సంస్కరణలను రూపొందించడం కాదు సమర్థవంతంగా వాటిని అమలు చేయాలని ఆమె తెలిపారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్.వి ప్రసాద్:విద్యావిధానంలో పారదర్శకత తీసుకురావాల్సి ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్.వి ప్రసాద్ అన్నారు. విద్యావిధానం సరైన మార్గంలో పయనించే దిశలో కమిటీల సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సూచనలు చేయాలని ఆయన అన్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ :విద్యాలయాల్లో మౌలిక వసతులు పెంపొందించే లాగా విద్యాసంవత్సరం, ఫీజుల నియంత్రణను సక్రమంగా నిర్వహించేలాగా కమిటీ సూచనలు ఉండాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ అన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారంగాని అంశాలపై కమిటీ తనదైన అధ్యయనం చేపట్టాలని ఆయన కోరారు.

సమావేశంలో భాగంగా ప్రస్తుత విద్యావిధానంలో అమలవుతున్న విధివిధానాలు, సమగ్రంగా చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలు, వివిధ శాఖల భాగస్వామ్యం, మౌలిక వసతుల రూపకల్పన, మానవ వనరుల అభివృద్ధి, పాఠశాల విద్యావిధానాల్లో తీసుకురావాల్సిన సంస్థాగత మార్పులు, కే12 విధానం అమలు, వొకేషనల్ విద్యావిధానం, విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉన్నత విద్య విధానాల్లో స్పష్టంగా అనుసరించాల్సిన అంశాలు, విద్యా సంవత్సరాన్ని పటిష్ఠ పరిచే ప్రణాళికలు, పరిపాలన పరమైన పర్యవేక్షణ, ఉపాధ్యాయుల శిక్షణ, సాంకేతిక పరమైన డిజిటల్ తరగతుల విధానంలో బోధన, సంస్థాగత నిర్మాణం, త్వరితగతిన ఫలితాలు రాబట్టే ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు-వాటి పర్యవేక్షణ, ఛైర్మన్ పర్యవేక్షణలో ఉన్నత, పాఠశాల విద్య స్థాయిల్లో ఇప్పటివరకు అమలు చేస్తున్న కార్యక్రమాల పునఃసమీక్ష, సంస్కరణల అమలుకు 4 నెలల వ్యవధిలో పూర్తిస్థాయి నివేదిక అందించి చర్చల అనంతరం చర్యలకు తగిన సూచనలు చేయడం, విద్యా విధానాల్లో సమూల మార్పుల్లో భాగంగా పాఠ్య ప్రణాళిక , అంచనా, రాబట్టని ఫలితాలు, సామాజిక, మానవీయ నైపుణ్యం వంటి అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో ఎక్స్ పర్ట్ కమిటీ ఛైర్మన్ ఐఐఎస్ సీ బెంగుళూరు ప్రొఫెసర్ ఎన్. బాలకృష్ణన్ ఆధ్యర్వంలో సభ్యులుగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డా. సుధా నారాయణ మూర్తి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఉదయ్.బి.దేశన్, ఎన్ఐఈపీఏ ప్రతినిధి నళిని జునేజా, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి, ఎన్ఐఈపీఏ పూర్వపు వైస్ ఛాన్స్ లర్ జంధ్యాల బిజి తిలక్, ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పూర్వపు వైస్ ఛాన్స్ లర్ ఎన్. రాజశేఖర్ రెడ్డి, సామాజిక కార్యకర్త స్వరాజ్ రామకృష్ణంరాజు, ఎస్ఆర్ఐటీ ఫౌండర్ సెక్రటరీ ఎ.సాంబశివారెడ్డి, వికాస్ కేంద్ర సొసైటీ ప్రతినిధి బి.ఈశ్వరయ్య, పీపుల్స్ కంబైన్ డైరెక్టర్ డి.వి.ఆర్.కే ప్రసాద్, విద్యాశాఖ ఉన్నతాధికారులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్.వి ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ , కమిషనర్ సంధ్యారాణి, సుజాత శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *