జగన్ క్యాబినెట్లో చేరే ‘నెల్లూరు నేతలు’ ఎవరో?

apsecretariat.com

నెల్లూరు జిల్లా నుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందా అన్న అంశంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. నెల్లూరు ఎమ్మెల్యేలలో ఎవరికి వారే ఉద్దండులు.వీరంతా తమదైన శైలిలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వైసీపీకి  బాగా పట్టున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఈ ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాలను పార్టీ గెలుచుకుంది.  గెలుపొందిన ఎమ్మెల్యేల్లో కాకలుతీరిన రాజకీయ యోధులు, పార్టీకోసం అహర్నిశలు శ్రమించినవారు, మాజీమంత్రులు ఉన్నారు. మేకపాటి కుటుంబం మొదటినుంచి జగన్ వెంట నడిచింది. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ మేకపాటికి ఎన్నో ఆఫర్లు ఇచ్చింది. వాటన్నింటిని  తిరస్కరించి జగన్ వెంటే నిలిచారు మేకపాటి. జగన్ కోరిందే తడవుగా రెండుసార్లు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి. ఈ ఎన్నికల్లో ఆయనకి ఎంపీ టిక్కెట్టు ఇవ్వకున్నా మారు మాట్లాడలేదు. రాజమోహన్‌రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా గతంలో జగన్ కోరిన వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం వీరి కుటుంబంలో ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటినుంచి వీరు వైసీపీకి వీరవిధేయులుగా ఉన్నారు కాబట్టి.. ఈ కుటుంబం నుంచి ఒకరికి మంత్రి పదవి తప్పకుండా లభిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్‌తో మేకపాటి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కూడా కలిసొస్తుందని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి  వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా క్యాడర్‌ని ముందుకు నడిపించారు. గత ఎన్నికల్లోనూ, ప్రస్తుత ఎన్నికల్లోనూ సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపొందారు. సర్వేపల్లిలో టీడీపీ తరఫున పోటీచేసిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని రెండుసార్లు ఓడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయంగా సోమిరెడ్డితో కాకాణి గోవర్ధన్‌రెడ్డి అలుపెరగని పోరాటం సాగించారు. కేసుల్లో సైతం ఇరుక్కున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి కాకాణి వీరవిధేయుడు. వైసీపీలో చేరినప్పటి నుంచి జగన్ సూచనలు పాటిస్తూ అడుగులేశారు.  కాబట్టి.. కాకాణి గోవర్థన్‌రెడ్డికే మంత్రి పదవి రావొచ్చని అంటున్నారు.  కాగా ఎన్నికలకి ముందు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరారు. వెంకటగిరి నుంచి పోటీచేసి ఎన్నికల్లో గెలుపొందారు. గతంలో ఎన్‌టీఆర్, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల క్యాబినెట్‌లలో మంత్రి పదవులు చేపట్టిన అనుభవం ఆయన కుంది.  రామనారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆనం సేవలను జగన్ ఎలా వాడుకుంటారో చూడాలి.
మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నుంచి వైసీపీ తరఫున గెలుపొందారు. జిల్లాలో నల్లపరెడ్డికి మంచి పేరే ఉంది. నల్లపరెడ్డి వైఎస్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జగన్ వెంట నడిచారు. గతంలో జగన్ చెప్పిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోవూరు ఉపఎన్నికల్లో ఆ పార్టీ పక్షాన గెలుపొందారు.నల్లపరెడ్డి కి క్యాబినెట్లో ఛాన్స్ లభించవచ్చని అంటున్నారు.
నెల్లూరు సిటీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా అనిల్‌కుమార్ యాదవ్ ఘనవిజయం సాధించారు. మంత్రి నారాయణపై గెలుపొందడం, మొదటినుంచి పార్టీకి విధేయత చాటుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండటం అనిల్‌కి ఉన్న ప్లస్ పాయింట్లు.  బీసీ కోటాలో అనిల్‌కి మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. ఇతర పార్టీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా శ్రీధర్‌రెడ్డి సున్నితంగా తిరస్కరించి, జగన్‌ వెంటే ఉన్నారు. తమ నేతకి మంత్రి పదవి రావొచ్చని ఆయన అనుచరులు ఆశాభావంతో ఉన్నారు.
కావలి నుంచి పోటీచేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ జగన్‌కి అత్యంత సన్నిహితుడు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డిపై పోటీచేసి ఆయన విజయం సాధించారు. వివాదరహితుడిగా ఆయనకి పేరుంది. ఇక సూళ్లూరుపేట నుంచి వరసగా రెండవసారి కిలివేటి సంజీవయ్య గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 61 వేల ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఎస్సీ కేటగిరిలో కిలివేటికి మంత్రి పదవి రావచ్చనే టాక్‌ ఉంది. వెలగపల్లి వరప్రసాద్‌రావు  గూడూరు నుంచి గెలిచారు. అంతకు ముందు తిరుపతి ఎంపీగా గెలిచారు. ఎస్సీ కోటాలో ఈయన మంత్రి  పదవి వస్తుందని  భావిస్తున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరికి జగన్ క్యాబినెట్  బెర్త్ లభిస్తుందో మరికొద్ది రోజులు ఆగితే కానీ తేలదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *