ఎవరీ అరవింద్ ? ఏమా కథ ?

apsecretariat.com
ధర్మపురి అరవింద్… మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ  సీఎం కేసీఆర్ కుమార్తెను ఓడించింది ఇతగాడే. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివిన అరవింద్ పట్టుదలతో బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేకతను,  పరిస్థితులను అనుకూలంగా మార్చుకొంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాడు. ఇంతకూ ఇతడు ఎవరో కాదు … కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగి ప్రస్తుతం తెరాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ రెండో కుమారుడే ఈ అరవింద్.
20 నెలల క్రితం బీజేపీ లో చేరి  సోషల్ మీడియాను కూడా సమర్ధవంతంగా వాడుకుని  ప్రత్యర్థి పై సమరం సాగించి గెలుపును సొంతం చేసుకున్నాడు.  దేశంలోని ఏ నియోజకవర్గంలో లేనివిధంగా నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో రైతులే 176 మంది. గెలుపొందిన బీజేపీ అభ్యర్థి అరవింద్ కి లభించిన మెజారిటీ కన్నా రైతులకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. ప్రచారం చేయకపోయినా..: రైతులకు మొత్తంగా 94,882 ఓట్లు పోలయ్యాయి. ప్రచారం చేయకుండానే వచ్చిన ఓట్లు ఇవి. తెరాస అభ్యర్థి కవిత 71,057 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
పసుపు బోర్డు అంశం రాష్ట్ర పరిధిలోనిది కాకపోయినా గిట్టుబాటు ధరపై రైతులతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరు మాట్లాడింది లేదు. వారికి ఎలాంటి భరోసా ఇచ్చింది లేదు. ఎవరు పోటీ చేసిన గెలుపు తమదేనన్న ధీమాతో..రైతుల్ని తెరాస  పట్టించుకోలేదన్న వాదనలున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ బాగా వాడుకుంది . బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్..పక్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. ముందు నుండీ క్షేత్ర స్థాయిలో పని చేశారు. ఈ అంశాలన్ని అరవింద్ విజయానికి దోహద పడ్డాయి. సమస్యల సాధన కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా తెరాస ప్రభుత్వం పట్టించుకోకపోగా, రైతు ప్రతినిధులపై పోలీసు కేసులు బనాయించి అరెస్టులు చేయడం అన్నదాతల్లో ఆక్రోశం పెల్లుబికేందుకు కారణమైంది. రైతుల్లో ఉన్న అసంతృప్తి అరవింద్ కి అనుకూలంగా మారింది.

 డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే తెరాసకు పోటీ ఇచ్చారు. ఏడు చోట్ల ఓడినప్పటికీ వారికి 3,39,653 ఓట్లు వచ్చాయి. తెరాసకు 5,75,128 ఓట్లు వచ్చాయి. బీజీపీ కి కేవలం 98,440 ఓట్లు రాగా  పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 4,80,004 ఓట్లు వచ్చాయి.ఈ పోరులో తెరాసకు 4,08,947 రాగా.. కాంగ్రెస్‌కు కేవలం 69,240 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2,70,413 ఓట్లు తగ్గాయి.

కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో ప్రచారం చేయని కారణంగా కిందిస్థాయి క్యాడర్‌ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో చీలిపోయాయి.  ఈ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మధుయాస్కికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కకపోవటం విశేషం.
పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తే తమను పట్టించుకోలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారు. కర్షకులంతా పార్లమెంటు ఎన్నికల్లో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయటం ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తామెలాగూ గెలిచే పరిస్థితి లేదు.. కానీ, తమను పట్టించుకోని వారికి మాత్రం రైతులెవరూ ఓటు వేయొద్దని ఊరూరా తీర్మానాలు చేశారు. పోలింగ్‌లో రైతు కుటుంబాలు బీజేపీ  వైపు మొగ్గు చూపారు.
అలాగే తెరాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ ను అధికారపార్టీ తెరాస వేధించిన తీరును  అరవింద్ జనంలోకి తీసుకెళ్లారు.  డీఎస్ పెద్ద కుమారుడు పై బోగస్ కేసులు పెట్టి వేధించారు. ఇవన్నీ జనం గమనించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం కూడా అరవింద్ గెలుపుకు సహకరించింది. ఇక సోషల్ మీడియాలో పుంజి బాజాపో వీడియో ప్రచారం యువతను బాగా కదిలించింది. కేసీఆర్ వైఫల్యాలను, మిషన్ భగీరధ లోని అవకతవకలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అరవింద్ కి ప్లస్ అయింది. నిజానికి నిజామాబాద్ ఓటమి కవితది కాదు…కేసీఆర్ దేనని విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *