వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి !!

apsecretariat.com

ఎస్‌టీ రిజర్వుడు స్థానమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పాముల పుష్పశ్రీవాణి వివాదం లో చిక్కుకున్నారు.  పుష్పశ్రీవాణి  నామినేషన్ తో పాటు  2013లో తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్నేసమర్పించారని  బీజేపీ గిరిజన మోర్చా ఆరోపిస్తోంది.  ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ఉన్నప్పటికీ ఆమె పాత  ధ్రువీకరణ పత్రాన్నేసమర్పించారని,  ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా దాన్ని ఆమోదించారని  బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ అంటున్నారు.  ఎన్నికల రిటర్నింగ్ అధికారి దానిని ఏ విధంగా ఆమోదించారని అయన ప్రశ్నిస్తున్నారు.  ఎమ్మెల్యే కుల విషయమై విచారణ జరపాలని  డిమాండ్ చేస్తున్నారు.బినామీ గిరిజనుల మూలంగా అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గాంధీ చెబుతున్నారు. పుష్పశ్రీవాణి సోదరి పాముల రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన అనంతరం.. ఆమె ఎస్‌టి కాదని అప్పట్లో పార్వతిపురం ఐటీడీఏ పీవో విచారణ చేసి నిర్ధారించారు. ఇదే విషయమై ఇప్పుడు అభ్యంతరం వస్తే అధికారులు ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావటం లేదని గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా పుష్పశ్రీవాణి కురుపాం నుంచి వైసీపీ తరపున 2014 లో కూడా గెలిచారు. అప్పట్లో ఆమెకు 55435 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి జనార్దన్ పై 19183 ఓట్ల ఆధిక్యత సాధించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పై 26602 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. ఆమెకు 74527 ఓట్లు వచ్చాయి. కురుపాం నియోజకవర్గానికి పలుమార్లు ఎమ్మెల్యేగా  శత్రుచర్ల విజయరామరాజు ఎన్నికయ్యారు. పుష్పశ్రీవాణి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కోడలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *